భోపాల్: అడవిలో బీడీ ఆకులు సేకరించడానికి వెళ్లిన ఓ మహిళలపై పులి (Tiger) పంజా విసిరింది. మెడ పట్టుకుని కిలోమీటర్ దూరంపాటు ఈడ్చుకెల్లి ఆమెను తినేసింది. మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలోలో చోటుచేసుకున్నది. బిచౌమల్ గ్రామానికి చెందిన హేమలతా దహర్వాల్ అనే 50 ఏండ్ల మహిళ.. అడవిలో టెండూ ఆకులు (బీడీ తయారుచేసేందుకు ఉపయోగించేవి) సేకరించడానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెపై దాడిచేసిన పెద్దపులి, మెడను నోట్లో కరుచుకుని సుమారు 1.5 కిలోమీటర్ల దూరం అడవిలోపలికి లాక్కెల్లింది. అనంతరం ఆమెను తినేసి వెళ్లిపోయింది.
అడవిలోకి వెళ్లిన ఆమె తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అడవిలో గాలింపు చేపట్టారు. ఈక్రమంలో వారికి ఆమె మృతదేహం లభించింది. దీంతో మృతదేహంతో ఖవాసా అటవీ కార్యాలయం ముందు ఐదు గంటలపాటు ధర్నా చేశారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే నిబంధనల ప్రకారం రూ.8 లక్షలు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. పులి కోసం అడవిలో గాలిస్తున్నామని చెప్పారు.