న్యూఢిల్లీ, జూలై 13: ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా వేడి పెరుగుతున్నది. ఈ పెరిగిన వేడి మరింత ఉరుములతో కూడిన తుఫానులకు దారి తీస్తున్నది. తత్ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ‘మెరుపు’ దాడులు సంభవిస్తున్నాయని సీనియర్ సైంటిస్టులు తెలిపారు. శుక్రవారం పిడుగుపాటుకు బీహార్లో 21 మంది, యూపీలో గురువారం 43 మంది మరణించారు. ప్రస్తుతం పెరుగుతున్న భూతాప పరిస్థితులను పరిశీలిస్తే.. భవిష్యత్తులో తుఫానులు, దాని ద్వారా సంభవించే పిడుగుపాటులు అధికం అవుతాయని భూ విజ్ఞాన శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ నాయర్ రాజీవన్ అభిప్రాయపడ్డారు.
వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా ఉష్ణ ప్రసరణ లేదా ఉరుములతో కూడిన మేఘాల ఏర్పాటు జరుగుతున్నదని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ పరిణామాలే వీటికి కారణమని అన్నా రు. వాతావరణ మార్పులతో గాలిలో తేమశాతం అధికమవుతుందని, దీంతో దట్టమైన మేఘాలు ఎక్కువగా ఏర్పడతాయని అన్నారు. ఐఎండీ మాజీ చీఫ్ కేజే రమేశ్ మాట్లాడుతూ.. ఆకాశంలో నల్లటి మేఘాలు ఏర్పడి కమ్ముకొస్తున్నట్టు గమనించిన వెంటనే ఆరు బయ ట ఉన్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పటిష్టంగా ఉన్న భవనాలు, గట్టి పైభాగం ఉండి కిటికీలు పైకి మూసి ఉన్న వాహనాలలోకి చేరుకోవాలని ఆయన సూచించారు.