IMD Weather Report | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్‌ని దాటాయి. ఎండలకు తోడు వడగాలు వీస్తుండడంతో జనం వణికిపోతున్నారు. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగా తెలంగాణ సహా పలు 16 రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జమ్మూకశ్మీర్, మణిపూర్, మిజోరం, త్రిపుర, కేరళ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ సహా 16 రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. బలమైన ఈదురుగాలులు వీచాయి. తూర్పు మధ్యప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల వడగళ్లు కురిశాయి. కేరళ, ఇంటీరియర్ కర్నాటక, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే భారత్‌లో 16 రాష్ట్రాల్లో రాబోయే నాలుగైదు రోజులు ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ వివరించింది.
ఈ నెల 7 వరకు వాయువ్య భారతదేశంలో ఉరుములు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నాలుగైదు రోజులు మధ్య, తూర్పు, ద్వీపకల్ప భారతదేశంలో మెరుపులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. మరో వైపు మే 5 నుంచి 8 వరకు ఈశాన్య భారతదేశంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఉత్తర పాకిస్తాన్, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా ప్రస్తుతం వేడి నుంచి ఉపశమనం కలుగుతుందని వాతావరణశాఖ చెప్పింది. గత 24గంటల్లో తెలంగాణలో పలుచోట్ల గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. తమిళనాడు, పుదుచ్చేరి, సౌత్ కర్నాటక, కోస్తాంధ్ర, ఛత్తీస్‌గఢ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్ తదితర రాష్ట్రాల్లో గంటకు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు రికార్డయ్యాయని తెలిపింది. తూరు మధ్యప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల వడగళ్లు కురిసినట్లు భారత వాతావరణ శాఖ వివరించింది.
రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా గత 24 గంటల్లో ఉష్ణోగ్రత 2 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ వరకు గణనీయంగా తగ్గింది. శనివారం సాయంత్రం ఝుంఝును, పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. అదే సమయంలో నాగౌర్‌లో రెండు మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. పలుచోట్ల 2 మిల్లీమీటర్ల కంటే తక్కువగానే వర్షం పడింది. రాజస్థానంలో అత్యధికంగా వేడి చిత్తోర్‌గఢ్‌లో నమోదైంది. ఇక్కడ 43.6 డిగ్రీలుగా రికార్డయ్యింది. పంజాబ్, హర్యానాలోని వివిధ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంది. పాటియాలాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 35.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువ. అదేవిధంగా లూధియానా, అమృత్సర్లలో ఉష్ణోగ్రతలు వరుసగా సాధారణం కంటే 1.5 డిగ్రీలు, 4.8 డిగ్రీలు తక్కువగా ఉంది. హర్యానాలో, అంబాలాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 2.6 డిగ్రీలు తక్కువ.
హిమాచల్‌ప్రదేశ్‌లో వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. లాహౌల్ శిఖరాలు, ధౌలాధర్ కొండ ప్రాంతాల్లో శనివారం భారీగా మంచుకురిసింది. సిమ్లాలోని థియోగ్లో భారీ వడగళ్ల వాన కారణంగా కుఫ్రి-ఫాగు రహదారి వడగళ్లతో నిండిపోయింది. వడగళ్ల వాన కారణంగా ఆపిల్, బఠానీ, కాలీఫ్లవర్ పంటలకు భారీ నష్టం కలిగించింది. రాజధాని సిమ్లా, ధర్మశాలలో మధ్యాహ్నం వర్షం పడింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు శనివారం మేఘావృతమయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలో ఎనిమిది నుంచి పది డిగ్రీల తక్కువగా నమోదైంది.