న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారింది. శనివారం నగరంలోని 6 స్కూళ్లకు ఈ-మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయని అగ్నిమాపక శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. పోలీసులు, డాగ్ స్కాడ్లతో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదని, బాంబు బెదిరింపులు నకిలీవిగా తేల్చారు.
పాఠశాలలకు నకిలీ బాంబు బెదిరింపులు రావటం ఈవారంలో మూడోసారి. దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో తాను చదువుకుంటున్న స్కూల్కు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు పంపినందుకు ఓ విద్యార్థిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థికి కౌన్సెలింగ్ నిర్వహించి, అతడి తల్లిదండ్రులను హెచ్చరించారు. కాగా, బాంబు బెదిరింపులపై ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ తాజాగా స్పందించారు. నగరంలో నెలకొన్న శాంతిభద్రతలపై ప్రజలంతా ఆందోళన చెందుతున్నారని, ఢిల్లీ నేరాలకు రాజధానిగా మారిందని విమర్శించారు.