Bihar | బిహార్లో(Bihar) ఘోర అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. అగ్నిప్రమాదంలో సంభవించి ముగ్గురు సజీవ దహనమవ్వగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన పాట్నా జిల్లా బఖ్తియార్పూర్లో శనివారం రాత్రి పురానీ బైపాస్ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..పురానీ బైపాస్ ప్రాంతంలోని ఒక బైక్ విడిభాగాల దుకాణం, దానికి ఆనుకుని ఉన్న ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో అత్త, కోడలు ,ఆరు నెలల చిన్నారి పాపతో సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు.
వివరాల్లోకి వెళ్తే..బఖ్తియార్పూర్లోని పురానీ బైపాస్ ప్రాంతంలో పంకజ్ కుమార్కు బైక్ విడిభాగాల దుకాణం ఉంది. దాని వెనుక ఉన్న ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి అతను నివాసం ఉంటున్నాడు. కాగా, శనివారం దుకాణం, ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. చూస్తుండగానే ఇల్లంతా మంటలు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్నవారికి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో పంకజ్ భార్య రీమా దేవి (45), తల్లి గీతా దేవి (70), మేనకోడలు ఆరు నెలల సుందరి కుమారి సజీవ దహనమయ్యారు.
మరోవైపు, చిన్నారి తల్లిదండ్రులు మోని కుమారి, శివం కుమార్ తప్పించుకునేందుకు ఇంటి పైకప్పు పైకి ఎక్కారు. అనంతరం అక్కడి నుంచి కిందకు దూకేశారు. ఈ ఘటనలో మోని కుమారి కాలు విరిగి తీవ్రంగా గాయపడింది. దీంతో ఇద్దరినీ స్థానికులు వెంటనే దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.