Encounter | ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో సోమవారం భద్రతా సిబ్బంది, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మహిళా మావోయిస్ట్ సహా ముగ్గురు హతమయ్యారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4 గంటల సమయంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దులోని అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కాల్పులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
సంఘటనా స్థలం నుంచి ఏకే 47 రైఫిల్‌తో పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారని.. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీస్ అధికారి పేర్కొన్నారు. తాజా ఎన్‌కౌంటర్‌తో ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలో వేర్వేరు ఘటనల్లో 157 మంది మావోయిస్టులు హతమయ్యారని పోలీసులు వివరించారు.