కొత్తగూడెం క్రైం, జనవరి 3: భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లా సోర్నమాల్ అడవుల్లో శుక్రవారం చోటు చేసుకుంది. సోర్నమాల్ అడవుల్లో ఒడిశా రాష్ట్రం నవపాడ జిల్లా నుంచి స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ), ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి సీఆర్పీఎఫ్ బలగాల సంయుక్త ఆధ్వర్యంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ క్రమంలో భద్రతా దళాలు, మావోయిస్టులు ఒకరికొకరు ఎదురుపడటంతో ఎదు రు కాల్పులకు దిగారు. నాలుగు వైపుల నుంచి సుమారు 300 మంది జవాన్ల తాకిడి పెరగడంతో వారి ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు.
ఘటనా స్థలం నుంచి ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు వారికి సంబంధించిన తుపాకులు, ఇతర మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటన అనంతరం ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో అడవులను భద్ర తా దళాలు జల్లెడ పడుతున్నాయి.