Manipur : కుకీ-నాగా తెగల మధ్య మణిపూర్లో ఘర్షణలు ఆగడం లేదు. తాజాగా ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ముగ్గురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన మణిపూర్, ఉక్రుల్ జిల్లాలో శుక్రవారం జరిగింది. మృతుల్లో ఇద్దరు కుకీ తెగకు చెందిన వారు కాగా, మరొకరు తంగ్కుల్ నాగా తెగకు చెందిన వారు. ద కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ముల్లామ్, షోంగ్ఫల్ గ్రామాల్లో కుకీ తెగవారు ఉంటారు.
వీరి ఇండ్లపై శుక్రవారం తెల్లవారుఝామున ఆయుధాలు కలిగిన నాగా తెగవారు దాడి చేశారు. ఈ దాడిలో కుకీ తెగకు చెందిన ఇద్దరు మరణించారు. పలువురు మహిళలు, పిల్లలు గాయపడ్డారు. వీరంతా నిద్రలో ఉండగా ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో కొన్ని ఇండ్లను కూడా దుండగులు తగులబెట్టారు. ఈ దాడుల్ని ఎదుర్కొనే క్రమంలో, తమ ప్రాణాల్ని రక్షించుకునేందుకు గ్రామస్తులు ఎదురుదాడికి దిగారు. ఈ దాడిలో నాగా తెగకు చెందిన ఒక వ్యక్తి మరణించాడు. అయితే, కుకీ తెగలవారు చేసిన ఈ ఆరోపణల్ని నాగా తెగ సెంట్రల్ కమాండ్ గార్డ్స్ ఖండించారు. తమ తెగకు చెందిన దళాలు గస్తీ విధులు నిర్వర్తిస్తుండగా.. కుకీ తెగకు చెందిన వారు దాడి చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు.
అక్కడకు వెళ్లిన తర్వాత కుకీ తెగవారు కాల్పులు జరపడంతో ఒక నాగా తెగ వాలంటీర్ మరణించాడని, మరో నలుగురికి గాయాలయ్యాయని చెప్పారు. దీంతో తాము కూడా ఎదురుకాల్పులు జరిపామన్నారు. ఈ ఘర్షణల నేపథ్యంలో భద్రతా బలగాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఇక రెండు తెగల మధ్య చాలా కాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి.