సంభల్, నవంబర్ 24: మసీదు సర్వే సందర్భంగా యూపీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. న్యాయస్థానం ఆదేశాలతో సంభల్లో ఒక చారిత్రక మసీదులో సర్వే చేస్తుండగా, చోటుచేసుకున్న అల్లర్లలో ముగ్గురు యువకులు మరణించగా, 30 మంది పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులు కాల్పులు జరపడమేకాక, పలు వాహనాలకు నిప్పు పెట్టి పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్ల దాడిలో సీఐ సహా 15 నుంచి 20 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వీరిలో ఒక కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయం కాగా, డిప్యూటీ కలెక్టర్ కాలు విరిగింది.
న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు మొఘలుల కాలం నాటి షాహి జామా మసీదును సర్వే చేయడానికి ఆదివారం ఉదయం ఏడు గంటలకు అధికార బృందం రాగా, వారిని ఒక వర్గం అడ్డుకుంది. ఆందోళనకారులు పెద్దయెత్తున మసీదు వద్ద గుమిగూడి నినాదాలు చేయడం ప్రారంభించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నించగా, అక్కడ ఉన్న మూక భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. అక్కడ ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో అల్లరిమూకను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జితో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అదే సమయంలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. అల్లర్లకు సంబంధించి ఇద్దరు మహిళలు సహా పదిమందిని అదుపులోకి తీసుకున్నామని మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బీజేపీపై విమర్శలు చేశారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ, అధికార యంత్రాంగం ఈ హింసాత్మక ఘటనలకు కుట్ర పన్నారని ఆరోపించారు.