గౌహతి: అస్సాంలో కేవలం ముగ్గురు విదేశీయులకు మాత్రమే పౌరసత్వ సవరణ చట్టం 2019 కింద భారతీయ పౌరసత్వాన్ని కల్పించినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ(CM Himanta Biswa Sarma) తెలిపారు. మొత్తం 12 మంది దరఖాస్తు చేసుకోగా, దాంట్లో ముగ్గురికే పౌరసత్వం ఇచ్చినట్లు చెప్పారు. సీఏఏ ద్వారా లక్షల సంఖ్యలో విదేశీయులు పౌరసత్వం పొందే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో అస్సాం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న మరో 9 మంది అంశం పర్యశీలినలో ఉన్నట్లు సీఎం వెల్లడించారు. సుమారు 20 నుంచి 25 లక్షల మందికి అస్సాంలో పౌరసత్వం ఇస్తారని ఆరోపణలు వస్తున్నాయని, కానీ ఇప్పటికి 12 దరఖాస్తులే అందాయని, దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలని సీఎం అన్నారు. కొత్త సీఏఏ చట్టం కింద పౌరసత్వం పొందిన తొలి వ్యక్తిని డులన్ దాస్‌గా గుర్తించారు. అతని వయసు 50 ఏళ్లు. ఆగస్టు 2024లో ఆయనకు భారతీయ పౌరసత్వం వచ్చింది.
బంగ్లా, పాక్, ఆఫ్ఘన్ దేశాల్లో మతపరమైన వేధింపులకు గురై భారత్‌లో ఆశ్రయం కోసం వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు, బౌద్దులకు పౌరసత్వం కల్పించేందుకు సర్కారు సీఏఏ చట్టాన్ని తయారు చేసింది. అయితే 2014, డిసెంబర్ 31వ తేదీ లోపు ఇండియాలోకి ప్రవేశించి, అయిదేళ్లు పూర్తి చేసుకున్న వారికి పౌరసత్వం ఇవ్వనున్నారు.