Bihar : బిహార్‌లో విషాదం జరిగింది. గంగానదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు పిల్లలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం ఉదయం బిహార్, దనాపూర్ సబ్‌డివిజన్, హేతన్‌పూర్ గంగా ఘాట్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంపై షాపూర్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సెలవు దినం కావడంతో హేతన్‌పూర్ గ్రామానికి చెందిన కొందరు పిల్లలు ఉదయం దగ్గర్లోని గంగా నదిలో స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో వారింలోంచి ముగ్గురు పిల్లలు అక్కడ స్నానం చేస్తూ, నదిలోపలికి వెళ్లిపోయారు.
నీళ్ల లోతు ఎక్కువగా ఉండటం, ప్రవాహ వేగం ఎక్కువ కావడం వల్ల ఆ పిల్లలు తిరిగి ఒడ్డుకు రాలేక, నీట మునిగిపోయారు. ఇది గమనించిన మిగతా పిల్లలు దగ్గర్లో ఉన్నవారికి విషయం చెప్పారు. వారు వెంటనే స్పందించి ఆ ముగ్గురు పిల్లల్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పుడే నీళ్లలో మునిగిన చిన్నారుల్ని కొద్దిసేపటి తర్వాత వాళ్లంతా కలిసి రక్షించి, ఒడ్డుకు తీసుకువచ్చారు. అప్పటికే వారి పరిస్థితి విషమించింది. కొన ఊపిరితో ఉన్న వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆలోపే ముగ్గురు పిల్లలు మరణించారు. వేర్వేరు కుటుంబాలకు చెందిన ముగ్గురు మృతుల వివరాలివి. పీయూష్ కుమార్ (10), తేజ్ కుమార్ (12), ప్రిన్స్ కుమార్ (10).
పిల్లల మరణంతో చిన్నారుల కుటుంబాలతోపాటు గ్రామస్తుల్లో విషాదం నెలకొంది. పోస్టుమార్టం అనంతరం పిల్లల మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. తక్షణ సాయం కింద అధికారులు రూ.20,000 అందజేశారు. అలాగే, నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందిస్తామన్నారు.