Surat | హైదరాబాద్, జూన్ 27 (స్పెషల్ టాస్క్ బ్యూరో- నమస్తే తెలంగాణ): ‘ఆత్మ నిర్భర్ భారత్’, ‘మేకిన్ ఇండియా’ పేరిట నినాదాలకే పరిమితమైన బీజేపీహయంలో వేలాది దేశీయ పరిశ్రమలు మూతపడ్డాయి. 150 ఏండ్ల చరిత్ర కలిగిన సూరత్ వజ్ర పరిశ్రమ, వందేండ్లనాటి పానిపట్ నూలు పరిశ్రమ మునుపటి ప్రభను కోల్పోయాయి. ఆర్డర్లు లేక వందలాది కంపెనీలు, మిల్లులు మూసివేయడంతో అందులో పనిచేసే కార్మికులు, నేతన్నలు దినదినగండంగా జీవితాన్ని గడుపుతున్నారు. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గిపోవడమే దీనికి కారణం. కష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాలని అటు కేంద్రప్రభుత్వానికి, ఇటు బీజేపీపాలిత గుజరాత్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రపంచంలోని 80 శాతానికి పైగా వజ్రాలను గుజరాత్‌లోని సూరత్ పరిశ్రమల్లోనే శుద్ధి చేస్తారు. సౌరాష్ర్ట, నవ్సారి ప్రాంతాల్లో నివసించే దాదాపు 30 లక్షల మంది.. సూరత్‌లోని 20 వేల చిన్న, పెద్ద ఫ్యాక్టరీలు, దుకాణాల కార్మికులు వజ్రాలను శుద్ధి చేసే పనిలో రోజూ నిమగ్నమవుతున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా రోజులో పది నుంచి పన్నెండు గంటలపాటు పనిచేసినప్పటికీ, వీరి నెల జీతం రూ.10 వేలు కూడా దాటట్లేదు. దీనిపై కార్మికులు ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా గుజరాత్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
తాజాగా వజ్రాల శుద్ధి పరిశ్రమపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమ దేశాలతోపాటు చైనాలో నెలకొన్న పరిస్థితులు, ఆర్థిక మాంద్యం తీవ్ర దుష్ప్రభావాన్ని చూపించా యి. దీంతో పాలిషింగ్ డైమండ్లకు ఇటీవల డిమాండ్ తగ్గింది. ఫలితంగా పలు కంపెనీలు మూతబడ్డాయి. 80 వేల మంది ఉపాధి కోల్పోయారు. కుటుంబాన్ని పోషించడానికి డబ్బులేక గత ఏప్రిల్-జూన్ మధ్య కనీసం 8 మంది కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2010 నుంచి 2022 వరకు 5 వేల మంది వజ్రాల శుద్ధి కార్మికులు ఆత్మహత్య చేసుకొన్నారంటే అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి అక్కడి కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉత్తరాదిలో వస్త్ర పరిశ్రమకు పేరుగాంచిన పుణె, సూరత్, ముంబై, భీవండీ, సోలాపూర్‌కు దీటుగా పానిపట్ నూలు వస్త్ర పరిశ్రమ ప్రసిద్ధి చెందింది. విదేశాలకు కూడా ఇక్కడి వస్ర్తాలు ఎగుమతవుతాయి. అయితే, బీజేపీ సర్కారు వచ్చాక జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, ప్రభుత్వ ప్రోత్సాహ లోపంతో పరిశ్రమ క్రమంగా దెబ్బతినడం ప్రారంభించింది. కరోనా సంక్షోభం మరింత కుదేలు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో నూలు వస్ర్తాల ఉత్పత్తి 50 శాతం పడిపోయినట్టు పానిపట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అండ్ నార్తర్న్ ఇండియా రోలర్ స్పిన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ సత్యదేవ అన్నారు. తమను ఆదుకోవాలంటూ నేతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.