ఇండోర్, డిసెంబర్ 16 : మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరాన్ని యాచకులు లేని నగరంగా మార్చాలని సంకల్పించిన జిల్లా యంత్రాంగం ఈ దిశలో మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ఇక్కడ భిక్షాటనపై నిషేధం ఉండగా, తాజాగా యాచకులకు డబ్బులు ఇచ్చేవారిపైనా కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. అలాంటి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. కొత్త ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ కొత్త చట్టం అమలులోకి రానున్నట్టు జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు. పుణ్యం కోసం దానం చేసి కష్టాలు పాలు కావద్దని కలెక్టర్ ప్రజలను హెచ్చరించారు. అయితే కలెక్టర్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. పేదవాడికి కప్పు చాయ్ కొనివ్వడం కూడా నేరమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా 10 నగరాలను యాచకులు లేని నగరాలుగా మార్చాలన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ఇండోర్లో అమలు చేయాలని నిర్ణయించారు.