Akhilesh Yadav : నాడు భారత స్వాతంత్య్ర సంగ్రామం (Freedom fight) లో పాల్గొనని వాళ్లు ఇప్పుడు వందేమాతరం (Vandemataram) గురించి, ఆ గీతం విలువల గురించి మాట్లాడుతున్నారని ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ (Samajwadi party) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) విమర్శించారు. లోక్సభలో వందేమాతరంపై చర్చలో పాల్గొన్న అఖిలేష్.. అధికార బీజేపీ నేతలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
వందేమాతరం జాతీయ గేయమని, ఆ గేయాన్ని ఒకరి నమ్మకాలను ఇతరులపై రుద్దే సాధనంగా వినియోగించడం కరెక్టు కాదని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ లోక్సభలో చర్చ చేపట్టారు. వందేమాతర గీతం స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అనుసరించాలని, స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా ఈ గీతం ప్రజలను ఒక్కటి చేసిందని అన్నారు.
ఇవాళ కొన్ని విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం వందేమాతరం గీతాన్ని వాడుకుంటున్నాయని బీజేపీపై విమర్శలు చేశారు. వాళ్లు (బీజేపీ నేతలు) నాడు బ్రిటిష్ పాలకులు పాటించిన ‘విభజించు.. పాలించు’ పాలసీనే అనుసరిస్తున్నారని ఆరోపించారు.