న్యూఢిల్లీ, జనవరి 23 : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకల్లో సంఘ విద్రోహ శక్తులు, నేరస్తులను పట్టుకోవడానికి పోలీస్ శాఖ కృత్రిమ మేధ (ఏఐ) పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నది. నేరగాళ్లపై నిఘాకు పోలీసులు ఈసారి ఏఐ కళ్లజోళ్లను వాడనున్నారు. కళ్లజోడులో ఇన్‌బిల్ట్‌గా ఏర్పాటు చేసిన కెమెరా.. మొబైల్ యాప్ సహకారంతో పనిచేస్తుంది.
ఇందులో 65 వేల మంది నేరగాళ్ల డాటా నిక్షిప్తమై ఉంటుంది. కళ్లజోడులోని కెమెరాలో ముఖ గుర్తింపు వ్యవస్థ (ఎఫ్ఆర్ఎస్) కూడా ఉంటుంది. ఎవరైనా నేరగాడు ఈ కెమెరా దృష్టిలో పడగానే, అతని నేరచరిత్రతో పాటు పుట్టుపూర్వోత్తరాలు అన్నీ క్షణాల్లో తెలియజేసి అప్రమత్తం చేస్తుంది. ఇందులో అమర్చిన థర్మల్ స్కానింగ్ ఫీచర్ దుస్తుల కింద, శరీరంపై రహస్యంగా దాచిన ఆయుధాలను సైతం పసిగడుతుంది.