Tamil Nadu CM : బీహార్ (Bihar) విజయవంతమయ్యామని, ఇక తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రమే తమ టార్గెట్ అని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ (CM Stalin) స్పందించారు. ఇది తమిళనాడు రాష్ట్రమని, ఇక్కడ అహంకార బీజేపీ (BJP) ఎప్పటికీ గెలవలేదని వ్యాఖ్యానించారు. అహంకారం కలిగిన ఏ పార్టీకి ఇక్కడ అవకాశం లేదని అన్నారు.
అహంకారంతో ఊగిపోయే ఏ రాజకీయ శక్తినైనా తాము ప్రతిఘటిస్తామని స్టాలిన్ స్పష్టంచేశారు. తిరువణ్ణామలై జిల్లాలో జరిగిన పార్టీ యూత్ వింగ్ నార్త్ జోన్ సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ.. అమిత్ షా లేదా సంఘ్ పరివార్ తమిళనాడులో విజయం సాధించలేరని అన్నారు. బీజేపీ తమిళ ప్రజల ఆలోచనను ఎప్పటికీ అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించారు.
ప్రేమతో తమ వద్దకు వస్తే ఆలింగనం చేసుకుంటామని, అహంకారంతో వస్తే మాత్రం తలవంచే పరిస్థితి లేదని స్టాలిన్ హెచ్చరించారు. బీజేపీని నేరుగా ఎదుర్కొని ఓడిస్తామన్నారు. బీజేపీ వరుసగా మూడోసారి జాతీయస్థాయిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మితవాద శక్తులు దూకుడుగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.
మితవాద శక్తులు ప్రజలను మోసం చేయడానికి తియ్యని అబద్ధాలు చెబుతున్నాయని స్టాలిన్ విమర్శించారు. అలాంటి వారితో పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బీజేపీ ఎప్పటికీ తమిళనాడులో గెలువదని అన్నారు. అందుకే అమిత్ షా చిరాకు పడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా సైద్ధాంతిక యుద్ధం చేస్తున్న ఏకైక ప్రాంతీయ పార్టీ డీఎంకే మాత్రమే అన్నారు.