PM Modi | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : ఇది యుద్ధాలు చేసే యుగం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులను శిక్షించామని, పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పామన్నారు. భారత సైన్యం సాధించిన ఈ విజయాన్ని దేశంలోని ప్రతి మహిళకు అంకితం చేస్తున్నట్టు చెప్పారు. ప్రధాని మోదీ సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్‌తో మన సైన్యం సత్తా ప్రతి ఒక్కరికి తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో సాయుధ బలగాలకు, నిఘా సంస్థలకు, శాస్త్రవేత్తలకు ప్రతి భారతీయుడి తరఫున సెల్యూట్ చేస్తున్నట్టు చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిని చూసి దేశంతోపాటు ప్రపంచం నివ్వెరపోయిందన్నారు. ఈ దాడి వ్యక్తిగతంగానూ తనను ఎంతో బాధించిందన్నారు. ఉగ్రవాదులను శిక్షించేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు.
దీంతో కచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకొని పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను, శిక్షణ శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. బహావల్పూర్, ముర్దికే వంటి కీలకమైన ఉగ్రవాద కేంద్రాలపై దాడులు చేసినట్టు చెప్పారు. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ఉగ్రదాడులకు ఈ క్యాంపులతో సంబంధాలు ఉన్నట్టు తెలిపారు. భారత సైన్యం దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్టు చెప్పారు. మన దేశంలోని ఆడబిడ్డల గౌరవానికి భంగం కలిగిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఉగ్రవాదులందరికీ కచ్చితమైన సందేశం ఇచ్చామన్నారు. ‘ఆపరేషన్ సిందూర్ ఒక పేరు మాత్రమే కాదు.. భారత్ ప్రతీకారం ఎంత తీవ్రంగా ఉంటుందో మే న ప్రంపంచం మొత్తం చూసింది’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉగ్రవాదంపై భారత విధానానికి ఆపరేషన్ సిందూర్ ఒక పాలసీగా మారిందన్నారు. ఇది యుద్ధాల కాలం కాదని.. ఇదే సమయంలో ఉగ్రవాదానికి కూడా కాలం కాదని స్పష్టం చేశారు.
భారత్ జరిపిన దాడులతో పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో కూరుకపోయిందన్నారు. అసహనంలో మన దేశంపైకి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడిచేసి తీవ్ర తప్పిదం చేసిందన్నారు. వాటిని మన రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా గాలిలోనే అడ్డుకున్నదన్నారు. మన సైన్యం ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తే, పాక్ సైన్యం మన విద్యాసంస్థలు, గురుద్వారాలు, ఆలయాలు, మిలిటరీ బేస్‌లు, పౌరుల ఇండ్లపై దాడులు చేసిందన్నారు. మన దేశ సరిహద్దులపై పాక్ దాడులు చేస్తే.. మన సైన్యం పాకిస్థాన్‌లోని వైమానిక స్థావరాలపై దాడులు చేసి, తీవ్ర నష్టం కలిగించిందన్నారు. భారత్ ప్రతీకార దాడులతో పాక్ గజగజ వణికిపోయిందన్నారు. విదేశాల సాయం కోరిందన్నారు. భారత డీజీఎంవోను సంప్రదించిందని, ఇకపై తమ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా చూస్తామని, సైనిక దురాక్రమణలకు పాల్పడబోమని హామీ ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో భారత సైన్యం తన దాడులను ఆపిందని చెప్పారు. ఇది తాత్కాలికం మాత్రమేనని, లక్ష్మణ రేఖ దాటనంత వరకే పాకిస్థాన్‌ను ఉపేక్షిస్తామన్నారు.
రాబోయే రోజుల్లో పాక్ చేసే ప్రతి తప్పిదానికి తగిన స్థాయిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. త్రివిధ దళాలు, బీఎస్ఎఫ్, పారామిలిటరీ యూనిట్లు హై అలర్ట్‌లోనే ఉన్నాయన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో మన దేశం సొంతంగా అభివృద్ధి చేసిన ఆయుధాల సామర్థ్యం కూడా ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు. ఇకపై అణ్వాయుధాలను బూచిగా చూపితే భయపడేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు ఆపరేషన్ సిందూర్‌తో పాక్ నిజస్వరూపం ప్రపంచానికి తెలిసిందని, ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారని గుర్తు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్నదని, భవిష్యత్తులో ఇది వారికి భస్మాసుర హస్తంగా మారుతుందన్నారు. ఒకవేళ పాకిస్థాన్ మనుగడ సాగించాలంటే, ఉగ్రవాదాన్ని సొంతంగా అంతం చేయాలన్నారు. సొంత గడ్డపై ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం తప్ప శాంతికి మరో మార్గం లేదన్నారు. ఇకపై పాకిస్థాన్‌తో ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి మాత్రమే చర్చలు జరుగుతాయన్నారు.