న్యూఢిల్లీ, జూలై 25 (నమస్తే తెలంగాణ): మణిపూర్లో జరుగుతున్న దారుణాలు ఒక్క ఆ రాష్ట్ర సమస్య లేదా ఈశాన్య భారతానికి చెందినది మాత్రమే కాదని బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘పార్లమెంటు వేదికగా తమకు సాంత్వన లభిస్తుందని మణిపూర్ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్ లోపల మాట్లాడకుండా బయట మాట్లాడుతున్నారు.
ఇది సరికాదు’ అని అన్నారు. సుప్రీంకోర్టు హెచ్చరించే వరకు కూడా కేంద్రం మణిపూర్ సమస్యను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నదని తెలిపారు. మరోవైపు పార్లమెంటు ఆవరణలో నిరసన దీక్ష కొనసాగిస్తున్న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ను మంగళవారం బీఆర్ఎస్ ఎంపీలు కలిసి మద్దతు తెలిపారు. ఆయనపై సస్పెన్షన్ను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.