Indian Railway | న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు ఇది చేదు వార్తే. ఏసీ కోచ్లలో ప్రయాణికులకు అందించే దుప్పట్లను నెలకోసారి మాత్రమే ఉతుకుతారట. ఈ విషయాన్ని స్వయంగా రైల్వేనే వెల్లడించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు రైల్వే ఇచ్చిన ఈ సమాధానం ప్రయాణికులను ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. ఏసీ కోచ్లలో ప్రయాణించే వారికి రైల్వే ఓ బెడ్షీట్, తలగడ, దుప్పటిని కవర్లో పెట్టి అందిస్తుంది. తెల్లగా ఉండే ఇవి చూడగానే శుభ్రంగా ఉన్న భావనను కలిగిస్తాయి. నిజానికి ఈ భావన తప్పని తాజాగా తేలిపోయింది.
ప్రయాణికులకు అందించే బెడ్షీట్, పిల్లో కవర్లను మాత్రం ఒకసారి ఉపయోగించిన తర్వాత ఉతుకుతారట. కానీ, దుప్పట్లను మాత్రం వాటి పరిస్థితిని బట్టి నెల, రెండు నెలలకోసారి మాత్రమే శుభ్రం చేస్తారట. అంటే ఒకరు ఉపయోగించిన దుప్పటిని వందలాదిమంది ప్రయాణికులు ఉపయోగిస్తారన్నమాట. రైలు జర్నీ పూర్తి చేసుకున్న తర్వాత దుప్పట్లను శుభ్రంగా ప్యాక్ చేసి యథాస్థానంలో పెడతారట. అవి దుర్వాసన వస్తున్నా, మురికిగా అనిపించినా అప్పుడు మాత్రమే వాటిని లాండ్రీకి పంపిస్తామని ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు రైల్వే సమాధానం ఇచ్చింది.