లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో పూరావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) మండిపడ్డారు. ఈ తవ్వకాల మాదిరిగానే వారి ప్రభుత్వాన్ని వారే తవ్వుకుని అంతం చేసుకుంటారని విమర్శించారు. ‘వారు (బీజేపీ ప్రభుత్వం) ఇలా శోధిస్తూనే ఉంటారు. ఏదో ఒక రోజు ఈ తవ్వడం, తవ్వకాల ద్వారా తమ ప్రభుత్వాన్ని తవ్వుకోవడంతో అంతమవుతుంది’ అని అన్నారు.
కాగా, ఇటీవల సంభాల్‌లోని మసీదు సర్వే నేపథ్యంలో అల్లర్లు చెలరేగడంతో పలువురు మరణించారు. ఆ తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పరిశీలనలో 46 ఏళ్లుగా మూతపడిన శివ, హనుమాన్ ఆలయాన్ని గుర్తించారు. దీంతో ఆ గుడిని తిరిగి తెరిచారు. ఈ నేపథ్యంలో సంభాల్ జిల్లాలోని పలు చోట్ల పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయి.
మరోవైపు ఆ జిల్లాలోని చందౌసి ప్రాంతంలో చేపట్టిన తవ్వకాల్లో 150 ఏళ్ల నాటి మెట్ల బావి ఆదివారం బయటపడింది. బిలారీ రాజు తాత కాలంలో నిర్మించిన నాలుగు అంతస్తుల మెట్ల బావిని ‘బిలారీ కి రాణి కి బావడి’గా రెవెన్యూ రికార్డుల్లో నమోదైనట్లు ఆ జిల్లా కలెక్టర్ రాజేంద్ర పెన్సియా తెలిపారు. ఆ మెట్ల బావిని పూర్తిగా వెలికితీసేందుకు తవ్వకాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.