AAP : ఢిల్లీ ప్రభుత్వం (Delhi govt) శనివారం మహిళా సంవృద్ధి యోజన (Mahila Samridhi Yojana) పథకానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు (BJP National president) జేపీ నడ్డా (JP Nadda) మీడియాకు వెల్లడించారు. ఈ పథకం కింద అర్హురాలైన ప్రతి మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ మహిళలకు బీజేపీ సర్కారు శుభవార్త చెప్పిందని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు.
అయితే దీనిపై ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ పెదవి విరిచింది. మహిళా సంవృద్ధి యోజన పేరుతో బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళలను వంచించిందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్ ఆరోపించారు. పథకానికి ఆమోదం తెలిపారు గానీ ఆ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయం చెప్పలేదని విమర్శించారు. అదేవిధంగా ‘బీజేపీ గెలిస్తే మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ మహిళలు రూ.2,500 చొప్పున అందుకుంటారని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని, ఇప్పుడు మహిళలకు డబ్బులు ఇవ్వకుండా ఉత్త ప్రకటన మాత్రమే చేశారని ఎద్దేవా చేశారు.
ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి అర్హులు, అనర్హులు అంటూ నియమ నిబంధనలు పెడుతున్నారని, ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు ఇవేవీ చెప్పలేదని కక్కర్ ఆరోపించారు. అప్పుడు ఓట్ల కోసం కండిషన్స్ చెప్పలేదని, ఇప్పుడు ఓట్లు ముగిశాక కండిషన్స్ అప్లయ్ చేస్తున్నారని విమర్శించారు.