Lok Sabha : భారత రాజ్యాంగం (Indian Constitution) అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభ (Lok Sabha) లో రెండు రోజులపాటు జరిగిన చర్చకు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన గత కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. 1975లో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ హరించారని, దేశాన్ని జైలుగా మార్చారని మోదీ ఆరోపించారు.
‘రాజ్యాంగం 25 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు చిరిగిపోయింది. నాడు (1975లో) ఎమర్జెన్సీ విధించారు. రాజ్యాంగ హక్కులన్నీ హరించబడ్డాయి. దేశాన్ని జైలుగా మార్చారు’ అని మోదీ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని గాంధీ కుటుంబం అవమానించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గొంతు నొక్కిందని విమర్శించారు. ప్రజల మద్దతు లేకుండానే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిందని వ్యాఖ్యానించారు.
దళిత నేత సీతారాం కేసరిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని, ఆయనను బాత్రూమ్లో బంధించిందని మోదీ గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలకులు ఎమర్జెన్సీ విధించి వేల మందిని జైళ్లకు తరలించారని ఆరోపించారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్ ముగ్గురూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ప్రజలను విభజించారని మండిపడ్డారు.