న్యూఢిల్లీ: లండన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై ఇవాళ పార్లమెంటు ఉభయసభల్లో రభస చోటుచేసుకుంది. రాహుల్‌గాంధీ సభకు క్షమాపణ చెప్పాలని ఇటు లోక్‌సభలో, అటు రాజ్యసభలో కేంద్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor).. రాహుల్‌గాంధీకి మద్దతుగా నిలిచారు.
రాహుల్‌గాంధీ దేనికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఇవాళ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాహుల్ తన లండన్ ప్రసంగంలో తప్పుగా ఏమీ మాట్లాడలేదన్నారు. ‘భారత ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజానీకం దృష్టిలో చక్కగా ఉంది. కానీ సమస్యలను తాము పరిష్కరించుకుంటాం. ఈ విషయం అందరికీ తెలియాలని కోరుకుంటున్నాం’ అని రాహుల్‌గాంధీ స్పష్టంగా చెప్పారని ఇందులో తప్పు ఏమున్నదని థరూర్ ప్రశ్నించారు.