న్యూఢిల్లీ, ఆగస్టు 21: సరిగ్గా.. నాలుగు నెలల కిందట. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ఫలితంగా పలు దేశాల్లో ఆహార సంక్షోభం నెలకొంటే.. ప్రపంచానికి తిండి పెడతామంటూ ప్రధాని నరేంద్రమోదీ గంభీరంగా ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో కూడా మాట్లాడానని, ప్రపంచ వాణిజ్య సంస్థ అంగీకరిస్తే ప్రపంచ దేశాలకు ఆహారం సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు మన దేశంలోనే గోధుమల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సిన అత్యవసరం ఏర్పడింది. దీనికంతటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ముందుచూపు లేక పోవటమే కారణమని నిపుణులు మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ సహా పలు రాష్ర్టాల నుంచి ధాన్యం సేకరణకు మొండికేసిన మోదీ సర్కారు.. గోధుమల నిల్వల విషయంలోనూ అలసత్వం ప్రదర్శించి దేశం మొత్తం ఆ ప్రతిఫలం అనుభవించే దుస్థితికి తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గోధుమల కొరత ఎందుకు?
గత మార్చిలో వీచిన వడగాడ్పులతో గోధుమ పంట ఉత్పత్తిపై ప్రభావం పడింది. పంట పండక దిగుబడి రాలేదు. వాస్తవానికి 111 మిలియన్ల టన్నుల గోధుమలు ఉత్పత్తి అవుతాయని ఫిబ్రవరిలో అధికారులు అంచ నా వేశారు. కానీ 102 మిలియన్ల టన్నుల కంటే ఎక్కువ గోధుమలు ఉత్పత్తి అయ్యే పరిస్థితులు లేవు.
ఆకాశాన్నంటిన ధరలు
ప్రపంచంలోనే అత్యధికంగా గోధుమలు పండిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇక్కడి నుంచి విదేశాలకు, విదేశాల నుంచి మన దేశానికి ఎగుమతి, దిగుమతి చేసుకొనే అవసరం ఎప్పుడూ రాలేదు. మనకు సరిపడా గోధుమలను మనమే పండించుకొన్నాం. రబీ సీజన్లో ఉత్పత్తి తగ్గిపోవటంతో ధరలు భారీగా పెరిగాయి. అప్పటికి గానీ నిద్ర మత్తు వదలని కేంద్రం.. ఆలస్యంగా మే 13న ఎగుమతిపై నిషేధం విధించింది. దిగుమతి సుంకాన్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలపైనా పరిమితులు విధించింది. మరోవైపు గోధుమల దిగుమతిపై వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. దేశీయ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని ఆదివారం తెలిపింది.
ప్రపంచానికి అన్నం పెడతాం..
విదేశాలకు తిండి గింజలు పంచుతాం.. భారత్‌లో పుష్కలంగా ఆహారం ఉన్నది! కావాలంటే రేపటి నుంచే అందిస్తాం!!
-రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభ సమయంలో ప్రధాని మోదీ ఆర్భాటపు హామీ 4 నెలలు కూడా తిరగకముందే..
దేశంలో గోధుమల కొరత నెలకొన్నది.. మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటాయి.. దెబ్బకు దిగుమతిపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు? వ్యాపారుల వద్ద నిల్వలపై పరిమితులు.. ఇప్పుడిక దిగుమతికి నిర్ణయం!