Cancer | న్యూఢిల్లీ: వంట చేసేటపుడు అందుబాటులో ఉంటుందని చాలామంది వంటనూనెను గ్యాస్ స్టవ్‌కు పక్కనే ఉంచుకుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి చేటు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ సహా రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. గ్యాస్ స్టవ్ పక్కనే నూనె బాటిల్స్ ఉంచడం వల్ల ఆక్సిడైజేషన్ ప్రక్రియ వేగవంతమవుతుందని పేర్కొంటున్నారు.
వంట నూనెల్లో అధిక కొవ్వు పదార్థాలు ఉంటాయి. నూనె సీసాను లేదా ప్యాకెట్‌ను తెరచిన వెంటనే ఈ కొవ్వు పదార్థాలు క్షీణించడం మొదలవుతుంది. ఫలితంగా ఆ నూనె రుచి మారుతుంది. దుర్వాసన వస్తుంది. ఇటువంటి నూనెను వాడటం వల్ల వేగంగా ముసలితనం వస్తుంది. కొలెస్టరాల్ లెవెల్ పెరుగుతుంది. ఊబకాయం, బరువు పెరగడం, జీర్ణ సంబంధిత సమస్యలు వంటివి బాధిస్తాయి.
నూనెలను తీసుకొచ్చిన సీసాలు, కవర్లలోనే ఉంచడం, గాలి, వెలుతురు చొరబడకుండా గట్టిగా మూత పెట్టడం శ్రేయస్కరం. వెజిటబుల్ ఆయిల్స్‌ను చల్లని, వెలుతురు తగలని చోట్ల నిల్వ ఉంచాలి. మూత తెరిచిన తర్వాత 3 నుంచి 6 నెలల్లోగా ఉపయోగించాలి. వాల్నట్, హేజెల్‌నట్, ఆల్మండ్ నూనెలను ఫ్రిజ్‌లో పెట్టాలి.