రాంచి: అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ తన పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. భూ కుంభకోణం కేసులో ఆయనను ఈడీ అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నదని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సొరేన్ సీఎం పదవికి రాజీనామా చేసి.. తన భార్య కల్పనకు పగ్గాలు అప్పగిస్తారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ నుంచి సీఎం సొరెన్కు ఏడోసారి సమన్లు వెళ్లాయి.
ఇది జరిగిన కొద్ది గంటల్లోనే జేఎంఎం ఎమ్మెల్యే ఒకరు తన పదవికి రాజీనామా చేయటం ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది. వందేండ్ల క్రితం నాటి భూమి పత్రాల్ని ఫోర్జరీ చేసి, వాటిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని, వివాదాస్పద స్థలాలన్నీ సీఎం సొరేన్ ఆధీనంలో ఉన్నాయన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.