Smart Meters | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : స్మార్ట్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా బీహార్‌లోని పలు గ్రామాల ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టినప్పటి నుంచి కరెంట్ బిల్లులు రెండు, మూడు రెట్లు ఎక్కువగా వస్తున్నట్టు వాపోయారు. మీటర్లలో సమస్యలతో కరెంటు సరఫరాలో తరుచూ అంతరాయం కలుగుతున్నట్టు మండిపడ్డారు. అధికారులు వెంటనే ఈ మీటర్లను తొలగించి వాటి స్థానంలో పాత మీటర్లను బిగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు నందలాల్‌పూర్, మిల్లీచక్, బహదూర్‌పూర్, ఐనాయత్పూర్, రోస్రా, సమస్తీపూర్ తదితర గ్రామాల ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నిరసనలను అణచివేయడంలో భాగంగా పలు గ్రామాలకు అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. దీంతో ఆ గ్రామాలు రెండుమూడు రోజులుగా అంధకారంలోనే ఉండాల్సివచ్చింది. నిరసనలను అదుపులోకి తీసుకురావడానికి కరెంట్ సరఫరాను నిలిపివేయడం నిజమేనని, అయితే, తర్వాత సరఫరాను పునరుద్ధరించినట్టు విద్యుత్తుశాఖకు చెందిన ఇంజినీర్ దీపక్ చౌదరీ పేర్కొనడం గమనార్హం. బీహార్‌వ్యాప్తంగా 2024 చివరినాటికి 1,72,08,939 స్మార్ట్‌మీటర్లు బిగించాలని 2023లో సీఎం నితీశ్‌కుమార్ ఆదేశించారు. అయితే, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ఇప్పటివరకూ 40,01,215 మీటర్లను మాత్రమే అధికారులు బిగించారు. దీంతో డెడ్‌లైన్‌ను 2025కు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా పేర్కొంది.
స్మార్ట్‌మీటర్లకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేస్తుంటే, అధికారులు కరెంటు సరఫరాను నిలిపేస్తున్నారు. ఇది అన్యాయం. ముందు స్మార్ట్‌మీటర్లపై ప్రజలు చెప్తున్న అభ్యంతరాలను ప్రభుత్వం ఓపిగ్గా వినాలి. సమస్యలను పరిష్కరించాలి. అలా చేయకుండా ఏకపక్షంగా ముందుకువెళ్లడం సరైన పద్ధతి అనిపించుకోదు. – రజాక్, నందలాల్‌పూర్ గ్రామస్థుడు