Electricity Bill | ఓ వృద్ధురాలికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ షాకిచ్చింది. వందలు కాదు.. వేలు కాదు ఏకంగా లక్షల్లో బిల్లు వేసి షాక్‌కు గురిచేసింది. బిల్లును చూసి ఒక్కసారిగా కంగుతిన్న ఆ వృద్ధురాలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది.
65 ఏళ్ల సుమన్ హరియాణా రాష్ట్రం పానిపట్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. 60 ఏళ్లుగా ఆ ఇంట్లో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. కాగా, తాజాగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆమెకు షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.21.89లక్షల కరెంటు బిల్లును అందజేసింది. అది చూసిన ఆమె ఒక్కసారిగా కంగుతింది. ఈ క్రమంలోనే వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. బిల్లు రిసిప్ట్‌తో పాటు ఓ బ్యానర్‌ను పట్టుకుని విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లింది. అక్కడ బ్యాండ్ వాయిస్తూ.. మిఠాయిలు పంచి మరీ నిరసన వ్యక్తం చేసింది.
ఇంతకీ ఆ బ్యానర్లో ఏం రాసుందనుకుంటున్నారు..? ‘ఇంత బిల్లు నేను కట్టలేను. అందుకే నా ఇంటిని అమ్మాలనుకుంటున్నాను. బిల్లు కిందకు ఈ ఇంటిని మీరే తీసుకోండి’ అని రాసిఉంది. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా, 2019లోనూ సుమన్‌కు రూ.12 లక్షల విద్యుత్ బిల్లు వచ్చిందంట. అయితే గత నెలలోనే ఆ బిల్లు మొత్తం చెల్లించినట్లు బాధితురాలు తెలిపింది. ప్రస్తుతం వచ్చిన బిల్లును చెల్లించలేనని వాపోయింది. రూ.21లక్షల బిల్లు కట్టలేనని.. తన వద్ద ఉన్న చివరి ప్రయత్నం ఇంటిని విక్రయించడమేనని ఆవేదన వ్యక్తం చేస్తోంది.