హైదరాబాద్, ఏప్రిల్ 21 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను ఆగమాగం చేసిన పశ్చిమాసియా యుద్ధం ప్రభావం సాగు రంగం మీద కూడా పడింది. వ్యవసాయ దిగుబడికి కీలకమైన ఎరువుల ఉత్పత్తిపై పశ్చిమాసియా ఉద్రిక్తతలు తీవ్ర ప్రభావాన్ని చూపినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఘర్షణల కారణంగా మార్చిలో దేశీయంగా ఎరువుల తయారీ 24.6 శాతం మేర తగ్గినట్టు సోమవారం వెల్లడించింది. ఎరువుల కొరత ఏర్పడితే వానకాలం పంటపై ప్రభావం పడొచ్చని, ఇది ఆహార సంక్షోభానికి దారి తీయొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు పాల్పడటంతో పశ్చిమాసియాలో యుద్ధం మొదలైంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై దాడులకు దిగడమే కాకుండా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. యూరియా వంటి ఎరువుల తయారీకి సహజవాయువు కీలకం. అయితే, హొర్ముజ్‌ను మూసేయడంతో సహజవాయువును రవాణా చేసే ట్యాంక ర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో దేశీయంగా ఎరువుల తయారీ మందగించింది.
గత ఫిబ్రవరిలో ఎరువుల ఉత్పత్తి 3.4 శాతం, జనవరిలో 3.7 శాతం, డిసెంబర్లో 4.1 శాతం మేర పెరిగినట్టు కేంద్రం చెబుతున్నది. అయితే, ఖరీఫ్ సీజన్‌కు (వానకాలం) సంబంధించి జూన్-జూలైలో దేశీయంగా ఎరువులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మార్చిలో ఎరువుల ఉత్పత్తి నాలుగో వంతు మేర పడిపోవడంతో డిమాండ్-సరఫరా మధ్య అంతరం పెరుగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఖరీఫ్ సీజన్‌కు 3.4 కోట్ల టన్నుల కంటే ఎక్కువగా ఎరువులు అవసరపడొచ్చని, సరఫరా ఆ మేరకు జరుగుతుందా? లేదా? అని ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే, పరిస్థితులు మరింత దిగజారవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇది ఆహార సంక్షోభానికి కూడా దారితీయొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.