INDIA Alliance | న్యూఢిల్లీ, డిసెంబర్ 28: అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠాపనకు హాజరవ్వాలా వద్దా అనే విషయంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో సందిగ్ధత నెలకొన్నది. కార్యక్రమానికి హాజరు కాకపోతే తమపై హిందూ-వ్యతిరేకులుగా ముద్ర పడుతుందేమోనని అవి భయపడుతున్నాయి. మరోపక్క హాజరైతే బీజేపీ చెప్పినట్టు ఆడాల్సి వస్తుందేమోనని ఆలోచిస్తున్నాయి. రామమందిర ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ తీసుకొనే నిర్ణయం 2024 ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా అని కాంగ్రెస్ నేత శశిథరూర్ను మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ సందిగ్ధతను స్పష్టం చేశాయి.
‘మీరు వెళితే మీరు బీజేపీ చెప్పినట్టు వ్యవహరిస్తున్నారని అర్థం. మీరు వెళ్లకపోతే మీరు హిందు వ్యతిరేకులు. ఇది అర్థం లేనిది. వ్యక్తులను ఆహ్వానించారు. వ్యక్తిగతంగానే నిర్ణయం తీసుకోనివ్వండి. నేను గుడిని రాజకీయ వేదిక అనుకోను. రాజకీయ కార్యక్రమానికి వెళ్లకపోవడం మిమ్మల్ని హిందూ వ్యతిరేకిని చేయదు’ అని గురువారం ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవడం కష్టమని కూటమిలోని పార్టీలు భావిస్తున్నాయి. అయితే రామ మందిరం ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న బీజేపీకి విపక్షాల నిర్ణయం వల్ల కొంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నది. మత విశ్వాసాలను రాజకీయికరణ చేశారణ విమర్శిస్తూ ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాలేనని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి తెలిపారు.
తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇదే తరహా అభిప్రాయంతో ఉన్నా తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ‘ఇవన్నీ రాజకీయాలు. బీజేపీ నిర్వహించే కార్యక్రమానికి హాజరవ్వాలని ఎవరు కోరుకుంటారు? ఇదేమీ జాతీయ కార్యక్రమం కాదు. బీజేపీ కార్యక్రమం అయ్యాక మేము అయోధ్యను సందర్శిస్తాం’ అని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించకపోయినా ఎన్నికల పరంగా ఎక్కువ నష్టం కలగకుండా ఉండేలా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే మందిరం ప్రారంభోత్సవానికి హాజరు కాకపోతే ఉత్తరాదిలో ఓట్లు రావేమోనని కాంగ్రెస్ ఆందోళన చెందుతున్నదని కేరళ జెమ్-ఇయ్యాతుల్ ఉలమా(సంస్థ) విమర్శించింది. అయితే మందిరం ప్రారంభోత్సవానికి హాజరవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకోవడం పార్టీలకు కానీ, వ్యక్తులకు కానీ అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రామ మందిరం రాజకీయ ఉద్యమంతో ముడిపడిన అంశం. దీనిపై పార్టీలు లేదా నాయకులు తీసుకొనే నిర్ణయాలను ఎన్నికల పరిణామాలతో కూడిన రాజకీయాల కోణంలో చూసే ప్రమాదం ఉందని చెప్తున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న గంట బరువు 600 కిలోలు. తమిళనాడులో తయారైన ఈ గంటను అయోధ్య రామాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం తుది దశకు చేరుకొన్న నిర్మాణ పనులు పూర్తి కాగానే ఈ గంటను ఏర్పాటు చేస్తారు.