గాజా, ఫిబ్రవరి 25: ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా గాజాలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడింది. తినడానికి తిండి లేని దుస్థితిలో గాజా ప్రజలు కలుపు మొక్కలనే ఆహారంగా తింటున్నారు. ఔషధ గుణాలున్న మాలో అనే మొక్కను వారు ఆహారంగా స్వీకరిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులతో గాజా నగరంలోకి సహాయ సామగ్రి తగినంతగా రావడం లేదు. దీంతో తినడానికి ఆహారం కరవై గత్యంతరం లేని పరిస్థితులలో ప్రజలు కలుపు మొక్కలనే ఆహారంగా తీసుకుంటున్నారు. వారి పిల్లలకూ అదే పెడుతున్నారు. 23 లక్షల జనాభా ఉండే గాజాలో యుద్ధం కారణంగా 80 శాతం మంది ఇప్పటికే ఇళ్లను వీడి వెళ్లిపోయారు. మిగిలిన వారికి సహాయం అందకపోవడంతో నీరు, ఆహారం, ఔషధాల కొరత తీవ్రంగా ఉంది. గాయపడ్డ వారికి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సరైన వైద్య చికిత్స కూడా అందడం లేదు. నొప్పి నివారణ, మత్తిచ్చే మందులు లేకపోవడంతో కొంతమందికి మెలకువగా ఉండగానే వైద్యులు ఆపరేషన్లు చేస్తున్నారు. దీంతో రోగులు బాధతో ఆర్తనాదాలు చేస్తున్నారు. బాంబులు, సైన్యం దాడితో ఇప్పటికే ఉత్తర గాజా ప్రాంతం శిథిలంగా మారింది.