న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11/(స్పెషల్ టాస్క్ బ్యూరో): బీజేపీలో అనధికారికంగా కొనసాగుతున్న 75 ఏండ్ల వయసులో పదవీ విరమణ నిబంధన ప్రధాని నరేంద్ర మోదీ పాలిట గుదిబండగా మారింది. మరో వారం రోజుల్లో అంటే ఈ నెల 17న 75 ఏండ్ల పడిలోకి ప్రవేశించనున్న మోదీ.. పదవీ విరమణ గండం నుంచి తప్పించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రధానిగా రెండు పర్యాయాలు పూర్తిచేసుకుని మూడవ పర్యాయం కొనసాగుతున్న మోదీ పూర్తికాలం పదవినే అంటిపెట్టుకునేందుకు తనకు తోచిన ప్రయత్నాలను శక్తివంచన లేకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌ని ప్రసన్నం చేసుకునేందుకు తిప్పలు పడుతున్నారు.
గురువారం 75వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న భాగవత్‌ని మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. ఆరెస్సెస్ చీఫ్‌గా భాగవత్ పదవీకాలం 100 సంవత్సరాల సంస్థ ప్రస్థానంలో గొప్ప మార్పులను తీసుకువచ్చిందంటూ ఆయన కీర్తించారు. ఈ మేరకు పలు జాతీయ పత్రికల్లో చాంతాడంత వ్యాసాన్ని రాశారు. ఆ వ్యాసంలోని ప్రతీ పదం భాగవత్‌ను పొగడటమే లక్ష్యంగా ఉండటంతో రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సంఘ్ చీఫ్‌ను ప్రసన్నం చేసుకొని, 75 ఏండ్ల రిటైర్మెంట్ గండాన్ని తప్పించుకోవడానికే మోదీ ఈ పాట్లు పడ్డారా? అని పలువురు అభిప్రాయపడ్డారు.
భాగవత్‌ని కీర్తిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ వ్యంగ్యాస్ర్తాలు సంధించింది. 75 ఏండ్ల రిటైర్మెంట్ నిబంధనను వీరిద్దరూ నీరుగారుస్తున్నారని విమర్శించింది. గతంలో బీజేపీ గొప్పగా చెప్పుకున్న 75 ఏండ్ల రిటైర్మెంట్ నిబంధన ఆ పార్టీ సిద్ధాంతం కాదని, కేవలం ఓ ఆయుధం మాత్రమేనని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. భాగవత్‌పై మోదీ చేస్తున్న ప్రశంసలు ఆయనకు బీమా పాలసీలాంటిదని కూడా ఠాగూర్ అభివర్ణించారు.