KC Venugopal : నీట్ పరీక్షల్లో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి ఫైరయ్యింది. ఇంత జరిగిన తర్వాత కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రికి ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కులేదని, ఆయన వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. గడిచిన ఐదేళ్లుగా ఆయనే విద్యామంత్రిగా ఉన్నారని, ఈ ఐదేళ్లలో ఏ పరీక్ష పెట్టినా అవకతవకలే జరిగాయని, తాజాగా నీట్లో అక్రమాలు బయటపడ్డాయని ఆయన చెప్పారు.
నీట్ పరీక్షలో కొంత గడబిడ జరిగిందనే కేంద్ర విద్యామంత్రే స్వయంగా ఒప్పుకున్నారని కేసీ వేణుగోపాల్ గుర్తుచేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యామంత్రి చెబుతున్నారని, అంతేతప్ప ఇప్పుడు వేల మంది విద్యార్థుల దుస్థితి ఆయన కనిపించడం లేదని విమర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఏడుస్తున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం విద్యార్థుల భవిష్యత్తుపై కించిత్తు ఆందోళన కూడా లేదని మండిపడ్డారు.
నీట్ పరీక్షల్లో అవకతవకల అంశాన్ని తాము పార్లమెంటులో లేవనెత్తుతామని కేసీ వేణుగోపాల్ హెచ్చరించారు. నీట్ అక్రమాల అంశాన్ని తాము పెద్దది చేస్తామని చెప్పారు. ఈ అంశంపై కేంద్రం స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని, దీని నుంచి వాళ్లు పారిపోయే ప్రయత్నం చేయకూడదని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.