న్యూఢిల్లీ: ఆదాయ పన్ను(ఐటీ) బిల్లుకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఐటీ బిల్లును ఈ నెల 10న పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్నుల వ్యవస్థ సంస్కరణలో భాగంగా ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.
ప్రత్యక్ష పన్నుల కోడ్గా పిలిచే ఈ కొత్త చట్టం ప్రస్తుత పన్ను స్వరూపం ప్రక్షాళనతోపాటు మరింత క్రమబద్ధీకరణ, పారదర్శకతకు ఉద్దేశించబడినదని వారు చెప్పారు. నేషనల్ కమిషన్ ఫర్ సఫాయీ కరంచారీ కాల పరిమితిని మూడేండ్లు పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31న ప్రస్తుత కమిషన్ కాల పరిమితి ముగియనుంది. స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ను రూ.8, 800 కోట్ల వ్యయంతో 2026 వరకు కొనసాగించేందుకు క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు.