Kashmir | శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని పార్టీలు, కుల, మత, వర్గ రహితంగా అందరూ తీవ్రంగా ఖండించారు. 35 ఏండ్ల తర్వాత తొలిసారిగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా కశ్మీర్ లోయలో బుధవారం బంద్ పాటించారు. లోయ అంతటా పలు చోట్ల శాంతి ప్రదర్శనలు జరిపారు.
మునుపెన్నడూ లేని విధంగా జమ్ముకశ్మీర్‌లోని ప్రధాన పార్టీలన్నీ పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. బీజేపీ, కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ), నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)లతో పాటు పలు సంస్థలు నిరసనలకు నాయకత్వం వహించి, బాధిత కుటుంబాలకు తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. వీరితో సామాజిక, రాజకీయ, మత సంస్థలు కూడా కలిసి నిరసనల్లో పాలుపంచుకున్నాయి. ఈ సందర్భంగా నిరసనకారులు పాకిస్థాన్ దిష్టిబొమ్మలను, ఆ దేశ జెండాలను దగ్ధం చేసి నినాదాలు చేశారు.
దేశ ఐక్యత, శాంతిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలని ప్రముఖ ముస్లింలతో కూడిన పౌర సమాజ గ్రూప్ పిలుపునిచ్చింది. అమాయకులను చంపడాన్ని ఇస్లాం ఎంతమాత్రం అంగీకరించదని, ఉగ్రవాదుల క్రూరత్వానికి అమాయక టూరిస్టులు బలవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.