న్యూఢిల్లీ: క్రిమినల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొనే బాలలకు బెయిలును నిరాకరించరాదని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఆ బాల నిందితుడు బెయిలుపై విడుదలైతే, ఓ నేరస్థుడితో జతకట్టే అవకాశం ఉందని కానీ, నైతిక, శారీరక లేదా మానసిక అపాయానికి గురికావచ్చునని కానీ, అతనిని విడుదల చేయడం వల్ల న్యాయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని కానీ కోర్టు రికార్డు చేసినపుడు మినహా ఇతర సందర్బాల్లో జువెనైల్కు బెయిలును తిరస్కరించకూడదని వివరించింది.
ఓ మైనర్పై లైంగిక దాడి కేసులో నిందితుడైన జువెనైల్కు బెయిలును నిరాకరిస్తూ జువెనైల్ జస్టిస్ బోర్డు, రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఏడాదిగా జైలులో ఉన్న జువెనైల్ను జామీను లేకుండా విడుదల చేయాలని ఆదేశించింది.