న్యూఢిల్లీ, అక్టోబర్ 28: వైద్యుల పట్ల శ్రద్ధ తీసుకుని వారికి అండగా నిలబడకపోతే సమాజం న్యాయవ్యవస్థను క్షమించదని సుప్రీంకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. అంతేగాక కొవిడ్-19 మహమ్మారి కాలంలో ప్రైవేటు డాక్టర్లు లాభాపేక్షతో పనిచేశారన్న అభిప్రాయాన్ని కూడా కోర్టు వ్యతిరేకించింది.
ప్రైవేటు క్లినిక్‌లు, డిస్పెన్సరీలు, గుర్తింపులేని దవాఖానలలో పనిచేస్తూ కొవిడ్-19పై పోరాడే క్రమంలో తమ ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లు, ఆరోగ్య కార్మికులను బీమా పాలసీలలో చేర్చకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
బీమా కంపెనీలు ఆరోగ్య సేవకులకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. రోగులకు సేవచేస్తూ వారు మరణించారని, వారికి బీమా చెల్లించాల్సిందేనని బీమా కంపెనీపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోర్టు తెలిపింది.