Supreme Court | న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీరును సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా ఎండగట్టింది. ఆ సంస్థ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నదని, ఇదంతా ఓ మూస పద్ధతిలో జరుగుతున్నదని మండిపడింది. రుజువులు లేకుండా ఆరోపణలు చేయడం ఓ నమూనాను అనుసరిస్తున్నట్లుగా మారిందని దుయ్యబట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణం కేసులో నిందితుని బెయిలు పిటిషన్‌పై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఏఎస్ ఓకా మాట్లాడుతూ, “మేం చాలా ఈడీ కేసులను పరిశీలించాం. ఇదొక మూస పద్ధతిగా, అసలుకు నకిలీని తయారు చేసినట్లుగా మారింది.
సాక్ష్యాధారాలు లేకుండానే ఈడీ ఆరోపణలు చేస్తున్నది” అన్నారు. నిందితుడు నేరం చేసి రూ.40 కోట్లు సంపాదించినట్లు ఈడీ ఆరోపించిందని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఈడీ చెప్పలేకపోతున్నదని ఎద్దేవా చేశారు. ఏదైనా కంపెనీకి, నిందితునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో కూడా చెప్పలేకపోతున్నదని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు గత వారం కూడా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. “దర్యాప్తు తనదైన వేగంతో జరుగుతూ ఉంటుంది. అది శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటుంది. మూడు ఛార్జిషీట్లను దాఖలు చేశారు. ఆ వ్యక్తిని కస్టడీలో ఉంచుతూ మీరు వాస్తవంగా శిక్షిస్తున్నారు. ఈ ప్రక్రియను మీరు శిక్షగా మార్చేశారు. ఇదేదో ఉగ్రవాది లేదా ట్రిపుల్ మర్డర్ కేసు కాదు” అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లో 2019-2022 మధ్య కాలంలో ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.2,000 కోట్లు అవినీతి జరిగిందని ఈడీ ఆరోపించింది. ఆదాయపు పన్ను శాఖ నమోదు చేసిన కేసు నేపథ్యంలో ఈ మనీలాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. ఫిక్స్డ్ మార్కెట్ షేర్‌ను ఇచ్చినందుకు డిస్టిలరీల నుంచి లంచాలు తీసుకున్నారని ఆరోపించింది.