Supreme Court | న్యూఢిల్లీ: విడాకుల కోసం వచ్చిన దంపతులకు సుప్రీంకోర్టు సోమవారం చక్కని సలహా ఇచ్చింది. రాత్రికి ఇద్దరూ కలిసి భోజనం చేయాలని, ఆ సమయంలో చర్చించుకుని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పింది. ‘మీకు మూడేళ్ల బిడ్డ ఉంది. మీ ఇరువురి మధ్య ఆత్మగౌరవానికి సంబంధించిన ఇబ్బందులు ఏమి ఉన్నాయి? మా క్యాంటీన్ దీనికి సరైనది కాకపోవచ్చు. మేం మీకు ఓ డ్రాయింగ్ రూమ్‌ను ఇస్తాం.
రాత్రి భోజనం వద్ద ఇద్దరూ కలుసుకోండి. ఓ కప్పు కాఫీ తాగేటపుడు ఎంతో జరగవచ్చు’ అని ధర్మాసనం తెలిపింది. ‘గతం గతః. అది ఓ చేదు గుళిక అనుకుని మర్చిపోండి. భవిష్యత్తు గురించి ఆలోచించండి’ అని హితవు పలికింది. ‘మీ నుంచి సానుకూల స్పందనను ఆశిస్తున్నాం’ అని తెలిపింది. తదుపరి విచారణను నేటికి (మంగళవారం) వాయిదా వేసింది. ఈ కేసులో భార్య ఫ్యాషన్ డిజైనర్. ఆమె తన మూడేళ్ల బిడ్డతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ సలహా ఇచ్చింది.