న్యూఢిల్లీ, జూలై 21: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అన్ని హద్దులు దాటుతున్నదని సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ సలహా ఇచ్చేందుకు లేదా దర్యాప్తు సందర్భంగా క్లయింట్లకు ప్రాతినిధ్యం వహించేందుకు న్యాయవాదులను ఈడీ పిలిపించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలియచేసింది. దీనిపై మార్గదర్శకాలు అవసరమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. న్యాయవాద వృత్తి స్వతంత్రతపై అటువంటి చర్యల ప్రభావాన్ని చర్చించేందుకు సుమోటోగా విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
సీనియర్ న్యాయవాదులు అరవింద్ దతర్, ప్రాత్ వేణుగోపాల్‌కి ఈడీ సమన్లు జారీచేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. న్యాయవాది, క్లయింట్ల మధ్య సంభాషణలు వారి ఇష్టపూర్వకంగా ఉంటాయని, న్యాయవాదులకు నోటీసులు ఎలా జారీ చేస్తారని సీజేఐ ప్రశ్నించారు. ఈడీ అన్ని హద్దులను దాటుతోందని ఆయన ఆక్షేపించారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందిస్తామని ఆయన తెలిపారు. సీని
యర్ న్యాయవాది దతార్ వంటి న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ఈడీ నోటీసులు జారీచేయడం న్యాయవాద వృత్తిని ప్రాక్టీసు చేసే వారిపై తీవ్ర ప్రభావం చూపగలదని న్యాయవాదులు వాదించారు. కాగా, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కల్పించుకుంటూ ఈ అంశం అత్యున్నత స్థాయికి వెళ్లిందని, న్యాయ సలహాను ఇచ్చేందుకు న్యాయవాదులకు నోటీసులు జారీచేయవద్దని ఈడీని ఆదేశించడం జరిగిందని చెప్పారు. న్యాయ అభిప్రాయాలు ఇచ్చేందుకు న్యాయవాదులకు సమన్లు జారీచేయకూడదని సొలిసిటర్ జనరల్ చెప్పారు.
అయితే తప్పుడు కథనాలు సృష్టిస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థలపై అపఖ్యాతి పాల్జేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. అయితే న్యాయవాదులు మాత్రం న్యాయ సలహా ఇచ్చేందుకు న్యాయవాదులకు సమన్లు జారీచేయడం మాత్రం ప్రమాదకర సంప్రదాయాలను నెలకొల్పుతుందని వాదించారు. ఇది కొనసాగిన పక్షంలో న్యాయవాదులు నిజాయితీగా, స్వంతంత్రంగా సలహాలు ఇవ్వడానికి వెనుకాడతారని ఓ న్యాయవాది తెలిపారు.
జిల్లా కోర్టు న్యాయవాదులు సైతం అకారణంగా వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న అటార్నీ జనరల్ జరుగుతున్న పరిణామాలు తప్పేనని ఒప్పుకున్నారు. కాగా, తమ దృష్టికి వచ్చిన వార్తలు చూసి ఆశ్చర్యపోయామని సీజేఐ తెలిపారు. అయితే మీడియా కథనాల ఆధారంగా అభిప్రాయానికి రాకూడదని సొలిసిటర్ జనరల్ హెచ్చరించారు. ఈ అంశంపై సమగ్ర వివరాలను అందచేయాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తోసహా అన్ని పక్షాలను ధర్మాసనం ఆదేశించింది.