న్యూఢిల్లీ: అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థినులందరికీ ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. రుతుక్రమ పరిశుభ్రత రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం జీవించే హక్కులో భాగమని తెలిపింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో బాలురకు, బాలికలకు వేర్వేరుగా, వికలాంగులకు ప్రత్యేక టాయిలెట్లు ఉండాలని పేర్కొన్నది. బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు లేకపోతే 14వ అధికరణ పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్టేనని ధర్మాసనం స్పష్టం చేసింది.
రుతుక్రమ ప్రక్రియలో బాలికల తప్పేమీ లేకపోయినా.. వారి శరీరాలను సమాజం భారంగా పరిగణిస్తున్నదని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. శానిటరీ ప్యాడ్స్, శౌచాలయాల సదుపాయాలను కల్పించని ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వ బడుల్లో ఈ సౌకర్యాలు లేకపోతే ప్రభుత్వాలను జవాబుదారీ చేస్తామని పేర్కొన్నది.
విద్యార్థినుల రుతుక్రమ ఆరోగ్య విధానంపై నిరుడు డిసెంబర్ 10న దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. శానిటరీ ప్యాడ్స్ లేక విద్యార్థినులు వస్ర్తాలను వాడుతున్నారని.. కొందరు ప్యాడ్స్ లేకపోవడం వల్ల ఆ సమయంలో బడికి వెళ్లలేకపోతున్నారని పిటిషనరైన సామాజిక కార్యకర్త జయ ఠాకూర్ కోర్టు దృష్టికి తెచ్చారు.