న్యూఢిల్లీ: న్యాయమూర్తులు ఋషి, సన్యాసి మాదిరిగా జీవించాలని, గుర్రాల మాదిరిగా పని చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. న్యాయ సంబంధిత అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా సంయమనం పాటించాలని, సామాజిక మాధ్యమాలను వాడవద్దని తెలిపింది. తీర్పులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని కోరింది. న్యాయ వ్యవస్థలో తళుకుబెళుకు ఆకర్షణలకు చోటు లేదని వివరించింది.
మధ్య ప్రదేశ్లో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు తమ ప్రొబేషన్ కాలంలో సంతృప్తికరంగా పని చేయలేదని మధ్య ప్రదేశ్ హైకోర్టు నిర్ధారించింది. ఆ ఇద్దర్నీ పదవి నుంచి తొలగించింది. వీరిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.