న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రముఖ రచయితలు, మేధావులు అందరి అభిప్రాయాలను తాము గౌరవిస్తామని, కాని వాట్సాప్ యూనివర్సిటీ నుంచి సమాచారాన్ని స్వీకరించలేమని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. కేరళలోని శబరిమల ఆలయం సహా ప్రార్థనా స్థలాల్లో మహిళపై వివక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్‌లు బీవీ నాగరత్న, ఎంఎం సుందరేశ్, అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, అగస్టిన్ జార్జి మాసిహ్, ప్రసన్న బీ వరాలే, మహదేవన్, జోయ్మాల్యా బాగ్చి ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు.
దావూదీ బోహ్రా సమాజ అధిపతి తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ తన వాదన వినిపిస్తూ మతపరమైన ఉపశమన విషయాల్లో న్యాయవ్యవస్థ సంయమనం గురించి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రస్తావించారు. ఈ దశలో సీజేఐ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ ప్రముఖులైన అందరు వ్యక్తులు, న్యాయకోవిదులు తదితరులను తాము గౌరవిస్తామని, కాని వ్యక్తిగత అభిప్రాయమంటే వ్యక్తిగత అభిప్రాయమేనని చెప్పారు. అందరి అభిప్రాయాలను తెలుసుకోవడంలో తప్పేమీ లేదని కౌల్ చెప్పారు. విజ్ఞానం, వివేకం ఏ మూలం నుంచైనా, ఏ దేశం నుంచైనా, ఏ విశ్వవిద్యాలయం నుంచైనా వస్తే దాన్ని స్వాగతించాలని, అన్ని రకాల జ్ఞానాన్ని సమాచారాన్ని స్వీకరించకుండా ఉండలేనంత గొప్ప నాగరికత మనదని కౌల్ అన్నారు. వెంటనే జస్టిస్ నాగరత్న సరదాగా కానీ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి కాదు అని అన్నారు.