West Bengal | కోల్‌కతా: ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం విషయంలో బెంగాల్ స్పీకర్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెల్చిన అధికార టీఎంసీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందుకోసం సభను ఒకరోజు ప్రత్యేకంగా నిర్వహించారు. ప్రమాణస్వీకారం అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే ఇలా ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుక్రవారం లేఖ రాశారు. స్పీకర్ తీరును ఆయన తప్పుబట్టారు.
భగవాంగొల ఎమ్మెల్యే రాయత్ హొస్సేన్ సర్కార్, బారానగర్ ఎమ్మెల్యే సయాంతికా బెనర్జీలతో ఎవరు ప్రమాణస్వీకారం చేయించాలి, ఎక్కడ చేయించాలన్న దానిపై రాజ్‌భవన్, అసెంబ్లీ మధ్య వివాదం నెలకొన్నది. ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయాలని గవర్నర్ ఆదేశించగా, అందుకు వారు నిరాకరించారు. గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా వారు ఆందోళన చేపట్టారు. సంప్రదాయాన్ని అనుసరించి తాము శాసనసభలోనే ప్రమాణం చేస్తామని స్పష్టంచేశారు. ఈ క్రమంలో అనూహ్యంగా తన వైఖరిని మార్చుకున్న గవర్నర్.. వారితో ప్రమాణం చేయించే బాధ్యతను డిప్యూటీ స్పీకర్‌కు అప్పగించారు. అయితే సభ ప్రారంభమైన తర్వాత డిప్యూటీ స్పీకర్ ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారు. స్పీకర్ సభలో ఉన్న సమయంలో వారితో తాను ప్రమాణం చేయించడం నిబంధనలకు విరుద్ధమన్నారు.