Shiv Sena | ముంబై, మే 13: పాకిస్థాన్‌పై సైనిక చర్యను నిలిపివేయడానికి అంగీకరించడం ద్వారా ‘అఖండ భారత్’ కోసం హిందూత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్ కన్న కలను నిజం చేసే అవకాశాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం వృథా చేసిందని శివసేన (యూబీటీ) మంగళవారం వ్యాఖ్యానించింది. యుద్ధం మరో నాలుగు రోజులు కొనసాగి ఉంటే పాక్ ఆక్రమిత కశ్మీరు(పీవోకే), కరాచీ, లాహోర్‌ను భారతీయ సాయుధ దళాలు స్వాధీనం చేసుకుని ఉండేవని, కాని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అవకాశాన్ని చెడగొట్టారని శివసేన(యూబీటీ) అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో విమర్శించింది.
సైనిక చర్యను నిలిపివేసే ముందు భారత్ కనీసం పీవోకేని వాపసు తీసుకుని, బలూచిస్థాన్‌ను పాకిస్థాన్ నుంచి విడగొట్టి ఉండాల్సిందని అభిప్రాయపడింది. పీవోకే నుంచి రామేశ్వరం వరకు, సింధూ నుంచి అస్సాం వరకు విస్తరించిన అవిభక్త భారత్ కోసం సావర్కర్ కలలు కన్నారని, ఆ అఖండ భారత్‌ను సాధించే అవకాశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం చేజేతులా వదులుకుందని సంపాదకీయం మండిపడింది.
భార్యల కండ్ల ముందే 26 మంది భర్తలను చంపిన నలుగురు పాకిస్థానీ ఉగ్రవాదుల గురించి మోదీ తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ ఉగ్రవాదులను పట్టుకొని ఉరితీయడం ఎంతో ముఖ్యం. అయితే, దాన్ని మోదీ విస్మరించారు. దీన్ని బట్టి ఆయనకు బాధితుల పట్ల దయార్థ హృదయం గానీ, భావోద్వేగాలు గానీ లేవని స్పష్టమవుతున్నది. లేకపోతే, ఆ భావోద్వేగాలు వెంటనే ఆయన నుంచి వచ్చేవి.
– సుబ్రమణ్య స్వామి, బీజేపీ నేత