జైపూర్, మే 11: రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేత సచిన్ పైలట్ అవినీతికి వ్యతిరేకంగా గురువారం జన సంఘర్ష్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్న అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి ఇది ఇబ్బందిగా మారింది. 125 కి.మీ మేర సాగే ఈ ఐదు రోజుల యాత్ర అజ్మీర్ నుంచి జైపూర్ వరకు కొనసాగనుంది.
‘నా గళాన్ని వినిపించడానికి, ప్రజల గొంతుకను తెలుసుకోవడానికి, నేను ప్రజల గళంగా మారడానికి’ ఈ యాత్ర చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. అవినీతిపై పోరాటం అగ్ని నదిని దాటడం లాంటిదని, మనం ఆ నదిని ఈదాల్సిందేనని ఆయన తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. వేలాది మంది మద్దతుదారులు ఈ యాత్రలో పైలట్‌ను అనుసరించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్ష పేపర్ల లీకేజీ గురించి కూడా ఈ యాత్రలో పైలట్ ప్రస్తావించారు. రాష్ట్రంలో అవినీతిని అరికట్టాలని ఏడాది కాలంగా తాను సీఎంకు లేఖలు రాస్తున్నా, ఎలాంటి చర్యలు చేపట్టలేదని మరోసారి ఆయన పునరుద్ఘాటించారు.