BJP | న్యూఢిల్లీ, జూలై 15: రాజ్యసభలో అధికార బీజేపీ బలం 86కు పడిపోయింది. పెద్దల సభలో శనివారంతో నలుగురు నామినేటెడ్ ఎంపీల పదవీకాలం ముగిసింది. రాకేశ్ సిన్హా, రామ్ షకల్, సోనాల్ మాన్ సింగ్. మహేశ్ జెఠల్మానీ రిటైర్ అయ్యారు. వీరిని రాష్ట్రపతి నామినేట్ చేసినప్పటికీ, తర్వాత అధికారికంగా మోదీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. తాజాగా వీరి పదవీ విరమణ చేయడంతో రాజ్యసభలో బీజేపీ ఎంపీల సంఖ్యాబలం 86కు పడిపోగా, మిత్రపక్షాలతో కలుపుకొంటే ఎన్డీయే సంఖ్యా బలం 101కు తగ్గిపోయింది. బీజేపీ బలం ప్రసుత్త లెక్కల ప్రకారం రాజ్యసభలో మెజార్టీ మార్క్(113)కు 12 సీట్ల దూరంలో ఆగిపోయింది. ఎన్డీయేకు ఇతర ఏడుగురు నామినేటెడ్, ఒక స్వతంత్ర ఎంపీ మద్దతును కలుపుకొన్నా బిల్లులను పాస్ చేయించుకొనేందుకు మరో నలుగురు ఎంపీల సపోర్టు అవసరం అవుతుంది. దీంతో పెద్దల సభలో ఏ బిల్లును నెగ్గించుకోవాలన్నా బీజేపీ ఏ కూటమిలోనూ లేని పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి రాజ్యసభలో 87 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో కాంగ్రెస్‌కు 26 మంది, తృణమూల్ కాంగ్రెస్-13, ఆప్, డీఎంకే పార్టీలకు 10 మంది చొప్పున ఎంపీల బలం ఉన్నది. ప్రస్తుతం ఎన్డీయే, ఇండియా కూటముల్లో లేని బీఆర్ఎస్కు నలుగురు, వైసీపీకి 11, బిజూ జనతాదళ్‌కు 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యసభలో బిల్లులను ఆమోదింపజేసుకోవాలంటే అన్నాడీఎంకే, వైసీపీ లాంటి ఎన్డీయే, ఇండియా కూటమియేతర పార్టీలతోపాటు నామినేటెడ్ ఎంపీలు, స్వతంత్ర ఎంపీలపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఖాళీ అయిన 4 నామినేటెడ్ సీట్లను భర్తీ చేయడంతోపాటు ఈ ఏడాది 11 ఖాళీ సీట్లకు జరగాల్సిన ఎన్నికలు పూర్తయ్యే వరకు బీజేపీకి ఈ పరిస్థితి తప్పదు. ఇప్పటికైతే రాజ్యసభలో బిల్లును పాస్ చేసుకొనేందుకు బీజేపీకి ఎన్డీయేలోని ఇతర పార్టీల 15 ఓట్లతో పాటు మరో 12 మంది ఎంపీల ఓట్లు అవసరం అవుతాయి. గతంలో అంశాలవారీగా కేంద్రంలోని బీజేపీకి మద్దతు పలికిన ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ.. ఈసారి ఆ పార్టీకి మద్దతిచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
మొత్తం 245 సీట్లున్న రాజ్యసభలో ప్రస్తుతం 20 ఖాళీలు ఉన్నాయి. వీటిల్లో 11 సీట్లకు ఈ ఏడాదిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. మహారాష్ట్ర, అస్సాం, బీహార్లలో రెండు చొప్పున, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపురలో ఒక్క స్థానం చొప్పున ఉన్నాయి. వీటిల్లో బీజేపీకి ఉన్న సంఖ్యా బలంతో కనీసంగా ఏడు సీట్లు గెలుచుకొనే అవకాశం కనిపిస్తున్నది. మహారాష్ట్రలో కూటమి ఎమ్మెల్యేలను నిలబెట్టుకోగలిగితే మరో రెండు సీట్లు కూడా గెలుచుకొనే చాన్స్ ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు.

రాజ్యసభ స్థానాలు- 245
ప్రస్తుతం ఉన్న ఖాళీలు-20
225 స్థానాలకు మెజార్టీ మార్క్-113
బీజేపీకి ఉన్న ఎంపీలు-86
ఎన్డీయే కూటమి -101
ఇండియా కూటమి – 87
వైసీపీ(11), బీజేడీ(9), అన్నాడీఎంకే(4), బీఆర్ఎస్(4)