అహ్మదాబాద్, జూన్ 27: గుజరాత్లోని కళాశాల ప్రవేశాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సాక్షాత్తూ అధికార బీజేపీ ఎమ్మెల్యేనే ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే కిషోర్ కనాని ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో ప్రవేశాలు గుజరాత్ కామన్ అడ్మిషన్ సర్వీస్ (జీసీఏఎస్) ద్వారా జరుగుతున్నాయని, వీటి ద్వారా ప్రవేశాలు లభించినప్పటికీ కొన్ని ప్రైవేట్ కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, అదనపు సొమ్ము కట్టనిదే వారికి ప్రవేశాలు కల్పించడం లేదని ఆయన ఆరోపించారు.
ప్రవేశానికి అర్హులైన వారు ఈ నెల 16 నుంచి 25లోగా ఆయా కాలేజీలలో రిపోర్టు చేయాలని, అయితే కొన్ని ప్రైవేట్ కాలేజీలు మెరిట్ విధానాన్ని అణగదొక్కుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీల అక్రమాలకు అంతే లేదని అన్నారు. కొందరు దళారులతో వీరు ఈ దందా నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు.