RBI | ముంబై, డిసెంబర్ 6: చిన్న, సన్నకారు రైతులకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తీపి కబురు అందించింది. తనఖా రహిత రుణ పరిమితిని రూ.2 లక్షలకు పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించింది. పెరిగిన పెట్టుబడి ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని రుణ పరిమితిని సవరించినట్టు తెలిపింది. బ్యాంకుల వద్ద ఎటువంటి తనఖా లేకుండా రైతులు ఇప్పటివరకు రూ.1.6 లక్షల వరకే రుణాలు పొందే అవకాశం ఉన్నది.
దీనిని ఇప్పుడు రూ.2 లక్షలకు పెంచింది. 2010 వరకు రైతుల రుణ పరిమితి లక్ష వరకే ఉండగా దానిని 2019లో రూ.1.6 లక్షలకు పెంచారు. తాజాగా పెంచిన రుణ పరిమితి వల్ల చిన్న, సన్నకారు రైతులు లబ్ధి పొందుతారని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. రుణ పరిమితి పెంపుపై త్వరలోనే బ్యాంకులకు సర్క్యులర్ జారీచేస్తామని వెల్లడించారు.