న్యూఢిల్లీ : ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల రద్దు నేపథ్యంలో 84 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ శనివారం ప్రకటించింది. ఈ రైళ్లు 104 ట్రిప్‌లు నడుస్తాయి. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పాట్నా, హౌరా వంటి ప్రధాన నగరాల్లో ట్రైన్ ట్రాఫిక్ పరిస్థితిని విశ్లేషించి ఈ ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ పరిస్థితికి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు, వాటి ట్రిప్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ) దిలీప్ కుమార్ చెప్పారు. ప్రత్యేక రైళ్ల గురించి సమాచారాన్ని విమానాశ్రయాల్లో ప్రచార ం చేయాలని ఆదేశించామన్నారు.
ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో చాలా మంది ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. నాగ్‌పూర్ నుంచి ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లేవారికి ప్రైవేట్ బస్సులు ఉపశమనం కలిగిస్తున్నాయి. కొందరు తమ బస్సులను నేరుగా విమానాశ్రయాల వద్దకు తీసుకెళ్తున్నారు.